Mahesh Babu

తమిళంలోనూ పెద్ద ఎత్తున ‘శ్రీమంతుడు’ రిలీజ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘శ్రీమంతుడు’ కోసం మహేష్ అభిమానులే కాక, సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో ఆగష్టు 7న విడుదల కాబోతోంది. గతంలో మహేష్ సినిమాలు కొన్ని తమిళంలో డబ్ అయినా అవేవీ నేరుగా తెలుగు సినిమా రిలీజ్ రోజే విడుదల కాలేదు. అయితే ‘శ్రీమంతుడు’ మాత్రం భారీ ఎత్తున తమిళంలోనూ ‘సెల్వందన్‌’గా ఆగష్టు 7నే విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు.

తెలుగులో మహేష్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా తెలుగు వర్షన్‌ను భారీ ఎత్తున విడుదల చేయడం సాధారణంగా జరిగేదే! కాగా తమిళంలోనూ ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయనుండడం విశేషంగా కనిపిస్తోంది. తమిళ నాట మహేష్‌కు ముఖ్యంగా చెన్నైలోనే ఎక్కువ క్రేజ్ ఉంది. మరి తమిళనాడు మొత్తం ఈ క్రేజ్ ఎంతమేరకు ఉందనేది సెల్వందన్‌తో తెలియనుంది. తమిళంలో ఒక పెద్ద హీరో సినిమాకు కేటాయించే అన్ని థియేటర్లలో సెల్వందన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. సుమారు 330 థియేటర్లలో సెల్వందన్ విడుదల కానుందట. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీస్ బ్యానర్ ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించింది.