బాహుబలి ఫ్లాప్‌ అయితే!

ఒక సినిమాపై దాదాపుగా సినిమా ట్రేడ్‌లో వున్న వారంతా ఇన్వెస్ట్‌ చేయడమనేది ఇంతకుముందెప్పుడూ చూసి వుండరు. బాహుబలి చిత్రంపై వున్న భారీ అంచనాలతో ఈ చిత్రాన్ని బయ్యర్లు భారీ రేట్లకి కొంటే, కింది స్థాయి బయ్యర్లు, ఎగ్జిబిటర్లు, థర్డ్‌ పార్టీల వాళ్లు బాహుబలిని ఒక్కో సెంటర్‌కి కనీ వినీ ఎరుగని ధరలకి సొంతం చేసుకున్నారు. మొత్తం తెలుగు రాష్ట్రాల్లోని సినీ వ్యాపారస్థుల డబ్బులో చాలా వరకు ఇప్పుడు బాహుబలి మీదే వుంది. ఈ చిత్రం చాలా పెద్ద హిట్‌ అయితే తప్ప దీనిపై ఇన్వెస్ట్‌ చేసిన వారికి పూర్తి డబ్బులు వసూలు కావు. లాభాలు రావాలంటే మాత్రం బాహుబలి బ్లాక్‌బస్టర్‌ కావాల్సిందే.

ఈ చిత్రంపై ఇంతగా బిజినెస్‌ వర్గాలు డిపెండ్‌ అయిపోయి వుండడంతో మిగిలిన సినిమాల వాళ్లు కూడా వర్రీ అవుతున్నారు. మహేష్‌బాబు చెప్పినట్టు బాహుబలి కానీ అటు, ఇటు అయితే ఇండస్ట్రీ మొత్తం ఎఫెక్ట్‌ అవుతుంది. చాలా పెద్ద సినిమాల్ని కొనడానికి ఇప్పట్లో బయ్యర్లు రాలేరు. ఈ చిత్రం ఏమాత్రం డిజప్పాయింట్‌ చేసినా కానీ టాలీవుడ్‌ బిజినెస్‌ స్లంప్‌లోకి వెళ్లిపోతుంది. అందుకే తన, పర బేధాలు లేకుండా ఇండస్ట్రీకి చెందిన అందరూ కూడా బాహుబలి కేవలం తెలుగులోనే వంద కోట్ల షేర్‌ వసూలు చేయాలని కోరుకుంటున్నారు.