భారీగా మొదలైన బాహుబలి హంగామా

అటు అన్ని రకాల సోషల్ మీడియాలో, ఇటు సినీ అభిమానుల్లో ట్రెండ్ సెట్ చేస్తున్న ఒకే ఒక్క పేరు ‘బాహుబలి’. ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అంతే కాకుండా రోజు రోజుకీ ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయే తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. జూలై 10న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో రిలీజ్ కానుంది. అనగా ఇంకా రిలీజ్ కి 9 రోజులు మాత్రమే ఉంది. కానీ అప్పుడే ఈ సినిమా హంగామా మొదలైపోయింది.

అప్పుడే సోషల్ మీడియాలో ఈ సినిమా బెనిఫిట్ షోస్ మరియు వాటి టికెట్స్ గురించిన చర్చ మొదలైంది. అప్పుడే బెనిఫిట్ షోస్ కి సంబందించిన టికెట్స్ కూడా ప్రింట్ అయిపోయాయి. ఇకపోతే అభిమానులు అప్పుడే థియేటర్స్ దగ్గర బాహుబలికి హోర్డింగ్స్, కటౌట్స్ కట్టడం మొదలు పెట్టేసారు. మరికొంతమంది అభిమానులైతే బాహుబలి సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తుందని అందులో ఎలాంటి అనుమానం లేదనే స్టేట్మెంట్స్ తో హోర్డింగ్స్ ని రెడీ చేస్తున్నారు. ప్రతో రోజు రిలీజ్ అవుతున్న పోస్టర్స్, టీజర్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తున్నాయి. మరోవైపు ఇంటర్వ్యూస్ లో ఈ మూవీ కెప్టెన్ ఎస్ఎస్ రాజమౌళి ప్రేక్షకులు ఎలాంటి అంచనాలతో వచ్చినా వారి అంచనాలను అందుకునేలా సినిమా ఉంటుందని ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలతో పాటు రమ్యకృష్ణ, సత్య రాజ్, సుధీప్, నాజర్, అడవి శేష్ లు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు. జూలై 3 కల్లా ఫైనల్ కాపీని సిద్దం చేయనున్న ఈ సినిమాని ఆర్కా మీడియా వారు నిర్మించారు.