బాహుబలి ఎఫెక్ట్‌

బాహుబలి రావడానికి ఇంకా వారం రోజుల సమయం వుంది. కానీ ఆ చిత్రం తాలూకు ఎఫెక్ట్‌ ఆల్రెడీ తెలుగు సినిమా బాక్సాఫీస్‌పై రిఫ్లెక్ట్‌ అవుతోంది. ఈ వారంలో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోతగ్గ సినిమా విడుదల కావడం లేదు. బాహుబలికి భయపడి నిర్మాతలంతా తమ సినిమాలని వాయిదా వేసుకుంటే... వారం రోజుల స్పేస్‌ చాలు అనుకుంటున్న చిన్న నిర్మాతలు మాత్రం తమ సినిమాల్ని విడుదల చేసేసామన్న పేరు కోసం 'మ మ' అనిపించేస్తున్నారు. బస్తీ, గబ్బర్‌సింగ్‌ గ్యాంగ్‌, సూపర్‌ స్టార్‌ కిడ్నాప్‌ వగైరా చిన్న చిత్రాలు ఈ శుక్రవారం రిలీజ్‌ అవుతున్నాయి.

వీటన్నిటిలోకి హాలీవుడ్‌ అనువాదం 'టెర్మినేటర్‌'కే ఎక్కువ ఆదరణ వుంటుందని అంచనా వేస్తున్నారు. బాహుబలి చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో వున్న తొంభై శాతం థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆడుతున్న సినిమాలన్నిటినీ దాదాపుగా తీసేస్తారు. కొన్ని ఊళ్లల్లో బాహుబలి తప్ప ఇంకో సినిమా వుండని పరిస్థితి కూడా కనిపిస్తోంది. అందుకే దానికి వారం రోజుల ముందు వచ్చి నష్టపోవడం కంటే, బాహుబలి టోర్నడో వెళ్లిపోయిన తర్వాత ప్రశాంతంగా అదృష్టం పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు.