ప్రభాస్ మర్యాదల పై రాజమౌళి సెటైర్లు !

వచ్చేనెల విడుదలకాబోతున్న ‘బాహుబలి’ నిర్మాణం చేస్తున్నప్పుడు జరిగిన అనేక ఆ శక్తికర సంఘటనలను ఈరోజు రాజమౌళి ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు. ఈ సినిమా నిర్మాణంలో తాము పడిన కష్టాన్ని వివరిస్తూ ఆ కష్టాల మధ్య ప్రభాస్ అతిథి మర్యాదలతో ‘బాహుబలి’ యూనిట్ పడిన టార్చర్ ను రాజమౌళి నవ్వుతూ వివరించాడు.

తాను ‘బాహుబలి’ తీస్తున్న సమయంలో తమ సెట్లో రెండురకాల వాతావరణం కనిపించేది అంటూ ఒక పూట అంతా విపరీతంగా కష్టపడితే మరొక పూట చాల సరదాగా కాలం గడిపే వాళ్ళమని అలా తాను చేయగలిగాను కాబట్టే తన యూనిట్ అంతా తన మాట వినేవారని కామెంట్ చేసాడు రాజమౌళి. ఉదయం టిఫెన్ దగ్గర నుంచి మధ్యానం లంచ్ వరకు అందరూ కలిసి ఒక కుటుంబ సభ్యులులా కలిసి తినడంతో తమ మధ్య ఒక కుటుంబ అనుబంధం ఏర్పడిందని కామెంట్ చేసాడు రాజమౌళి.

అయితే ప్రభాస్ ‘బాహుబలి’ యూనిట్ కు చేసిన అతిథి మర్యాదలు తట్టుకోలేకపోయామనీ సెటైర్లు వేసాడు రాజమౌళి. దీనికి కారణం ప్రభాస్ తన ఇంటి నుండి రకరకాల పిండివంటలు రకరకాల బిర్యానీలు రొయ్యలు చేపలకు సంబంధించిన రకరకాల వంటకాలను క్యారేజీల నిండా తీసుకు రావడమే కాకుండా ‘ఇది వేసుకో బంగారం ఇది రుచి చూడు డార్లింగ్’ అంటూ తాను తెప్పించిన వంటకాలను అందరికీ బలవంత పెట్టి మరీ తినిపిస్తూ ఉంటే లంచ్ బ్రేక్ తరువాత యూనిట్ సభ్యులు షూటింగ్ కు వస్తారా లేక నిద్రపోతారా అని ప్రభాస్ మర్యాదలు చూసి తెగ భయపడేవాడినని కామెంట్ చేసాడు రాజమౌళి.

కొన్నివేల మందితో యుద్ధ సన్నివేశాల షూటింగ్ తీస్తున్నప్పుడు తాను ఎవరికి ఎక్కడ అపాయం సంభవిస్తుందో అని ఎప్పుడూ రెండు అంబులెన్స్ లు రెండు ఫైర్ ఇంజన్లు సిద్ధంగా పెట్టుకుని షూటింగ్ చేసానని వివరించాడు రాజమౌళి. చాలామంది ‘బాహుబలి’ సినిమాకు కెప్టెన్ తాను అంటూ వార్తలు రాస్తారని కాని ‘బాహుబలి’ సినిమాకు అమ్మ తన వదిన శ్రీవల్లి అంటూ కొన్ని వేలమందిని ప్రతిరోజు పేరు పేరునా పలకరించడమే కాకుండా వారికి ఏమి కావాలో చూస్తూ అందర్నీ తనతో సహా ఏమైనా తప్పులు చేస్తే తిడుతూ ‘బాహుబాలి’ షూటింగ్ ను నడిపించిన తన వదిన శ్రీవల్లి లేకుంటే ‘బాహుబలి’ లేదు అని సంచలన వ్యాఖ్యలు చేసాడు రాజమౌళి. రెండు వందల కోట్లు డబ్బు కాదు కోట్లాదిమంది గుండె చప్పుడుగా ‘బాహుబలి’ మారిపోయింది అంటూ రాజమౌళి చెపుతున్న మాటలను బట్టి ఈ సినిమా రాజమౌళి జీవితం పై ఎటువంటి ప్రభావాన్ని చూపిందో అర్ధం అవుతుంది..